ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఓ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2022లో ఆడుతున్న అతను, తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ఆటగాడు సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో.. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌స్లామ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఏ ఒక్కరూ ఈ ఫీట్ సాధించిన దాఖలాలు లేవు. ఈ ఫీట్ సాధించడంతో పాటు తొలి రౌండ్‌లో విజయం సాధించిన జోష్‌లో ఉన్న జకోవిచ్.. వింబుల్డన్‌లో వరుసగా నాలుగో టైటిల్ కొట్టాలని పూనుకున్నాడు.
ఇదిలావుండగా.. గతేడాదిలో యూఎస్ ఓపెన్ మినహా, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను జకోవిచ్ సాధించాడు. కానీ, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టోర్నీలో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. అటు, వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఇతనికి వైరం ఏర్పడింది. ఈ కారణంగా జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగలేదు. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఇతను, క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. జకోవిచ్ ఖాతాలో ఇప్పటివరకూ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మరి, వింబుల్టన్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.