ఫామ్ కోల్పోయిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఆడుతున్నాడు. ఆంధ్ర తరఫున ఆడుతున్న నితీశ్.. శుక్రవారం డీవై పాటిల్ అకాడమీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి మూడు బంతుల్లో హర్ష్ గవాలి, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌ను ఔట్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన అతడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.
మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి మూడు ఓవర్లలో 17 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇది టీ20 క్రికెట్‌లో నితీశ్ బెస్ట్ గణాంకాలు. నితీష్ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 25 రన్స్ చేశాడు. కీలక సమయంలో శిఖర్ భరత్ (39)తో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇద్దరు ఔటైన వెంటనే ఆంధ్ర ఇన్నింగ్స్ గాడి తప్పింది. 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆంధ్ర జట్టు ఆలౌట్ అయింది.
Also Read: Vaibhav Suryavanshi 175: వైభవ్ సూర్యవంశీ మరో తుఫాన్ సెంచరీ.. 14 సిక్సులు, 30 బంతుల్లోనే..!
113 పరుగుల లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ 17.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. రిషభ్ చౌహాన్ (47), రాహుల్ బథమ్ (35 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (22) ఫర్వాలేదనిపించాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటీదార్ డకౌట్ అయ్యాడు. నితీశ్ హ్యాట్రిక్ మ్యాచ్‌ను రసవత్తరం చేసినా.. చౌహాన్–బథమ్ ఇన్నింగ్స్ మధ్యప్రదేశ్‌ను విజయానికి చేర్చింది. టెస్టు, వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుతో ఉన్న నితీశ్.. టీ20 సిరీస్‌లో మాత్రం చోటు కోల్పోయాడు.