ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్. తెలంగాణ నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల నిఖత్ జరీన్ ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిత్పోంగ్ జుటామాను ఓడించి .. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల విభాగంలో నిఖత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తరుపున గతంలో మేరికోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సీ మాత్రమే ఈ టోర్నిల్లో ఛాంపియన్లుగా నిలిచారు. ప్రపంచ టైటిల్ సాధించిన ఐదో భారతీయ మహిళగా నిఖత్ రికార్డు సృష్టించింది.
సంప్రాదాయక, మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ మహిళ ఎన్నో అవరోధాలను ఎదురించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్, తల్లి పర్వీన్ సుల్తానా నుంచి ప్రోత్సాహం లభించడంతో నిఖత్ ఈ స్థాయికి ఎదిగింది. నలుగురు అక్కాచెల్లెళ్లలో నిఖత్ మూడో వారు. నిజామాబాద్ లో షంసుద్దీన్ వద్ద నిఖత్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు.
నిఖత్ తన 13వ ఏట బాక్సింగ్ శిక్షణలో చేరారు. బాక్సింగ్ లో చేరిన 6 నెలల్లోనే 2010లో కరీంనగర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది. పంజాబ్ లో జరిగిన పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. తమిళ నాడు ఈరోడ్ లో జరిగిన జూనియర్ నేషనల్స్ లో స్వర్ణం గెలిచి బెస్ట్ బాక్సర్ గా ఎంపికయ్యారు. ఆ తరువాత విశాఖ పట్నంలో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్యాంపులో శిక్షణ పొందింది. 2011లో ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది నిఖత్. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నారు. తాజాగా ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విన్నర్ గా నిలిచారు నిఖత్ జరీన్