BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆయన పేరు కనిపించడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
Read Also: Electrical Flight : గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ ఫ్లైట్స్ వచ్చేశాయ్
కాగా రోజర్ బిన్నీ టీమిండియా 1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. బిన్నీకి కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయి. గతంలో కేఎస్‌పీఏ సమావేశాలకు సంతోష్ మీనన్ హాజరయ్యేవాడు. కానీ ఆయన స్థానంలో రోజర్ బిన్నీ సమావేశాలకు హాజరుకానున్నాడు. అయితే జై షా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు కావడంతో బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కొత్త బాస్ ఎవరో తెలియాలంటే ఈ నెల 18 వరకు వెయిట్ చేయక తప్పదు. అక్టోబర్ 18న ఎన్నికల నిర్వహణ, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బీసీసీఐ ప్రస్తుత సారథి గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.