ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. దీంతో టోర్నీలో ఆ జట్టుకు వరుసగా ఆరో ఓటమి ఎదురైంది. శనివారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(13) విఫలమయ్యారు. బ్రెవిస్ (31), సూర్య కుమార్ యాదవ్ (37), తిలక్ వర్మ(26) రాణించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు.
ఆఖర్లో పొలార్డ్ (25) అయినా ముంబైని గెలిపిస్తాడని అభిమానులు భావించినా అతడు కూడా అంచనాల మేరకు రాణించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా మూడు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్లో కేవలం ఒక సిక్స్ మాత్రమే వచ్చింది. అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. దీంతో అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.