ఐపీఎల్‌లో ఒక్కసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీజన్‌లో అత్యంత బలహీనంగా కనిపించిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు. అంచనాలకు తగ్గట్లే తొలి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు ఓటమి పాలైంది. అయితే తరువాతి మూడు మ్యాచ్‌లలో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి విజయాల ఖాతా తెరిచింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వంటి బలమైన జట్లపై విజయాలు సాధించింది. అయితే సన్‌రైజర్స్ విజయాలకు సెకండ్ బ్యాటింగ్ చేయడమే కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టాస్ గెలవడం ఆ జట్టుకు వరంగా మారిందంటున్నారు. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ గెలిస్తే అద్భుతం చేసినట్లే అని వివరిస్తున్నారు.
మరోవైపు సన్‌రైజర్స్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కూడా నెటిజన్లు కొనియాడుతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది, తగ్గేదేలే.. అట్లుంటది మనతోనే అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్న మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే అందరినీ తొక్కుకుంటూ పోవాలె అంటూ స్లోగన్స్ కూడా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.