MS Dhoni: టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ తన నాయకత్వంలో ఎన్నో టైటిళ్లను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ సహా టెస్టుల్లోనూ నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంది. అటు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ విజయవంతం అయ్యాడు. చెన్నై జట్టును ఏకంగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఘనతను సాధించాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా ఏ బాధ్యత ఇచ్చినా ధోనీ సమర్థంగా నిర్వర్తించాడు. అందుకే ధోనీ అంటే చాలా మంది అభిమానులకు ఇష్టం. ఇప్పటికీ ధోనీ ఆడుతుంటే చూడాలని పలువురు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ధోనీ క్రికెటర్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. అతి సామాన్య కుటుంబం నుంచి అతడు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా ఎదిగిన అతడు ప్రస్తుతం కోట్లు ఆర్జిస్తున్నాడు.
Read Also: టీ20 ప్రపంచకప్ చరిత్రలో చెక్కు చెదరని రికార్డులు
తాజాగా ఓ స్కూల్ కార్యక్రమంలో ధోనీ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. తన బాల్యంలో తాను ఎక్కువగా చదివే వాడిని కాదని ధోనీ వివరించాడు. స్కూల్ డేస్‌లో క్రికెట్ కోసం తాను క్లాస్‌లకు డుమ్మా కొట్టి ఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండటంతో మళ్లీ సంప్లిమెంటరీలు రాయాల్సి వస్తుందని తన తండ్రి ఆందోళన చెందేవారని.. తాను కనీసం టెన్త్ కూడా పాస్ కాలేనని తన తండ్రి భావించేవాడని ధోనీ తెలిపాడు. ఏడో తరగతిలో తాను క్రికెట్ ఆడడం ప్రారంభించే సమయానికి యావరేజి స్టూడెంట్‌నని, ఆ తర్వాత నుంచి హాజరు క్రమంగా తగ్గడం మొదలైందని ధోనీ చెప్పాడు. టెన్త్ క్లాస్‌కు వచ్చేసరికి తాను మంచి విద్యార్థిగానే గుర్తింపు తెచ్చుకున్నానని, టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తనకు 66 పర్సంటేజీతో మార్కులు వచ్చాయని వెల్లడించాడు. ఇంటర్‌లో 57 శాతం మార్కులు వచ్చాయని తెలిపాడు. ఒక్క అటెండెన్స్ విషయం వదిలేస్తే తాను గుడ్ స్టూడెంట్‌నేనని పేర్కొన్నాడు. క్రికెట్ కారణంగా తాను చాలా తక్కువగా క్లాసులకు హాజరయ్యేవాడినని.. టెన్త్ క్లాసులో కొన్ని చాప్టర్లు తాను చదవలేదని ధోనీ చెప్పాడు. పబ్లిక్ పరీక్షల్లో ఆ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చుంటే తన పని గోవిందా అయ్యేదన్నాడు. తాను టెన్త్ పాస్ కాలేనని భావించిన తన తండ్రితో తాను పాసయ్యానని చెప్పడం ఇంకా గుర్తుందన్నాడు