Dinesh Karthik: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని కంటే మూడు నెలల ముందే 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, ధోని వచ్చిన తర్వాత తుది జట్టులో చోటును మాత్రం సంపాదించడం అతడికి చాలా కష్టతరంగా మారిపోయింది. వికెట్, కీపర్ బ్యాటర్‌గా తనదైన ముద్ర వేశాడు మిస్టర్ కూల్. దీంతో అదే పాత్ర పోషించే దినేష్ కార్తీక్ అవసరం పెద్దగా జట్టుకు లేకుండా పోయింది.
Read Also: Siddhu Jonnalagadda : తెలుసు కదా.. టీజర్ డేట్ తెలుసా మాస్టారు
అయితే, ఓ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపింగ్ చేస్తుండే వాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యాడు.. దాంతో జట్టుకు శాశ్వత వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది.. ఇక, అప్పుడే తుది జట్టులో నాకు అవకాశం లభించింది.. కానీ, అది ఎక్కువ రోజులు ఉండలేదు. మహేంద్ర సింగ్ ధోనీ రాకతో మొత్తం మారిపోయింది. ధోనీని అందరూ గ్యారీ సోబర్స్‌తో పోల్చేవారు. దాంతో నాకు ఛాన్స్ లు వచ్చేవి కాదని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఇక, ఎంఎస్ ధోనీ నాకు చాలా నేర్పించాడు.. ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగానే అని కార్తీక్ తెలిపాడు. ధోనీ జట్టులో ఉండగా చోటు సంపాదించడం కోసం ఊసరవెల్లిలా మారిపోయాను అని పేర్కొన్నాడు. జట్టులో ఓపెనర్‌కు ప్లేస్ ఉంటే, నేను ఓపెనింగ్ చేశా.. మిడిల్ ఆర్డర్‌లో అవసరమైతే, అక్కడ బ్యాటింగ్ చేశా.. కెరీర్ చివర్లో 6, 7 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేశాను.. ఇలా చాలా ఒత్తిడి ఉండేది నాపై అన్నారు. చాలాసార్లు ఒత్తిడిలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను అని దినేష్ కార్తీక్ వెల్లడించారు. భారత్ తరఫున దినేష్ కార్తీక్ మొత్తం 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ-20 మ్యాచ్‌ల్లో ఆడాడు.