బీహార్‌లో ఎన్నికల వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక నవంబర్ కల్లా బీహార్ ఎన్నికలు ముగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
ఇది కూడా చదవండి: Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసిన సోనియా, ప్రియాంక
ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ జేడీయూకు సంచలన సవాల్ విసిరారు. ఈసారి నితీష్‌కుమార్ పార్టీ 25 సీట్ల కంటే ఎక్కువ గెలవదని తేల్చి చెప్పారు. ఒకవేళ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని ప్రకటించారు. కిషన్‌గంజ్ జిల్లాలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఈ శపథం చేశారు.
ఇది కూడా చదవండి: Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
2021లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 100 కంటే ఎక్కువ గెలవదని చెప్పానని.. తీరా ఆ ఎన్నికల్లో 77 సీట్లకే పరిమితమైందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బీహార్‌లో జేడీయూ 25 కంటే ఎక్కువగా ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఒకవేళ గెలిస్తే.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు.
దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని.. అందులో బీజేపీకి 40 శాతమే మద్దతు ఇస్తారని.. అంటే సగం మంది బీజేపీకి ఓటు వేయరన్నారు. గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, కమ్యూనిజం, సోషలిజాన్ని అనుసరించే హిందువులెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు. అందుకోసం ఈ 40 శాతం ఉన్న హిందువులు.. 20 శాతం ఉన్న ముస్లింలతో చేతులు కలిపితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఎంఐఎం ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదని.. అధికార పార్టీని ఓడించడానికి సైద్ధాంతికంగా ప్రేరేపించబడిన హిందువులతో కలిసి పోరాడాలని ఒవైసీని కోరారు. ఒవైసీ తనకు స్నేహితుడని.. ఆయన బీజేపీపై ఒంటరిగా పోరాడాలని కోరుకుంటున్నారని.. అలా కాకుండా సైద్ధాంతిక హిందువులతో కలిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఓడించడానికి మహాత్మాగాంధీ సిద్ధాంతమే ఏకైక మార్గం అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.