Mohammad Azharuddin Collected 15 Lakhs From Player Per Match: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎప్పట్నుంచో విభేదాలు ఉన్నాయి. సభ్యులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా.. టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ చీఫ్ అజారుద్దీన్‌పై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కి గాను రూ. 15 లక్షలు వసూలు చేశారంటూ కుండబద్దలు కొట్టారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, జి. వినోద్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
అజర్ పదవీ కాలం సెప్టెంబరు 26తోనే ముగిసిందని.. అయినా ఆయన తప్పుకోవడం లేదని మండిపడ్డారు. అజర్ పాలనలో హెచ్‌సీఏ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందన్నారు. అండర్-14, 16, 19, 22, సీనియర్ జట్లకు ఆటగాళ్ల ఎంపికను వ్యాపారంగా మార్చేశారని.. ఒక్కో మ్యాచ్‌కు ఆటగాళ్ల నుంచి రూ. 15 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. వయసును నిర్దారించే ధ్రువీకరణ పత్రం కోసం కూడా అజారుద్దీన్ రూ. 3 లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జట్టు ఎంపిక విషయంలోనూ అజారుద్దీన్ నిబంధనల ప్రకారం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో జట్టుకి గరిష్టంగా 15 మందిని మాత్రమే ఎంపిక చేయాలని, కానీ ఆయన నిబంధనలకి విరుద్ధంగా 30 మందిని తీసుకుంటున్నారని చెప్పారు.
సెప్టెంబరు 26కే అజారుద్దీన్ పదవీకాలం పూర్తయ్యింది కాబట్టి.. నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించి, త్వరలోనే ఎన్నికల తేదీని ప్రకటించాలని ఆ ముగ్గురు డిమాండ్ చేశారు. లేకపోతే.. ఉప్పల్ స్టేడియంలో డిసెంబరు 11న ప్రత్యేక ఏజీఎం నిర్వహించి, తామే ఎన్నికల తేదీని, రిటర్నింగ్ అధికారిని ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాము పర్యవేక్షక కమిటీకి కూడా తెలియజేశామని తెలిపారు.