Mathew Hayden Defends Bhuvaneshwar Kumar: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంత గొప్ప బౌలరో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాల్ని మార్చేసిన ఘనత అతనిది. తన బౌలింగ్ సామర్థ్యంతో క్లిష్ట సమయాల్లోనూ జట్టుని గట్టెక్కించన సందర్భాలెన్నో! కానీ, కొన్నిసార్లు ఘోరంగా విఫలమైన సంఘటనలూ ఉన్నాయి. ఉదాహణకు.. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని కొన్ని కీలక మ్యాచెస్‌లో, అలాగే రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇతను భారీ పరుగులు సమర్పించుకున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అయితే ఒక్క వికెట్ కూడా తీయకుండా, నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చాడు. దీంతో.. అతనిపై తీవ్ర విమర్శలు రేకెత్తాయి. భువి ఫామ్ కోల్పోయాడని, అతనికి బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి తరుణంలో అతనికి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ అండగా నిలిచాడు. భువినే డెత్ ఓవర్లలో ఉత్తమ ఫినిషర్ అంటూ కొనియాడాడు. ‘‘ఇప్పుడు భువిపై వస్తోన్న విమర్శల్ని నేను ఏమాత్రం అంగీకరించను. నా దృష్టిలో భువి డెత్ ఓవర్స్‌లో ఉత్తమంగా ఫినిష్ చేయగలడు. కొన్ని మ్యాచెస్‌లో బారీగా పరుగులిచ్చినా.. ఫినిషర్ మాత్రం అతడేనని నా భావన’’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం మరోలా స్పందించాడు. భువనేశ్వర్‌తో చివర్లో ఒక ఓవర్ మాత్రమే వేయించాలని తాను ఆసియా కప్ సందర్భంగానే చెప్పినట్లు గుర్తు చేశాడు. ‘‘భువనేశ్వర్‌తో డెత్ ఓవర్లలో ఒక ఓవర్ మాత్రమే వేయించాలి. ఇదే నేను మళ్లీ చెప్తున్నా’’ అని ట్వీట్ చేశాడు.