పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ గతంలో ఐపీఎల్ ద్వారా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాడే. క్రీడల మంత్రిగా పనిచేస్తున్నా ఆయన మాత్రం ఇంకా క్రికెట్ ఆడుతూ తనలో ఇంకా ఆడే సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మంత్రి పదవితో బిజీగా ఉన్నా ఇంకా క్రికెట్‌పై దృష్టి పెట్టడం అంటే మాములు మాటలు కాదు. ఈ సందర్భంగా అటు మంత్రి పదవిని.. ఇటు క్రికెట్‌ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారని మీడియా ఆయన్ను ప్రశ్నించింది.
మనం ఏ పని చేసినా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని మనోజ్ తివారీ బదులిచ్చాడు. మనోబలం ఉంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నాడు. ఉదయం పూట తాను ప్రతిరోజూ క్రికెట్ ఆడతానని.. సాయంత్రం పూట మంత్రిగా పనులు చక్కపెడతానని మనోజ్ తివారీ వివరించాడు. తనకు ఇంఛార్జి మంత్రి కూడా ఉండటం వల్ల వెసులుబాటు లభిస్తోందని తెలిపాడు. తాను క్రికెట్ ఆడేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. అవసరమైన వారికి రాత్రివేళల్లోనూ తాను ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానన్నాడు. కాగా గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లో ప్రవేశించిన మనోజ్ తివారీ… తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. క్రీడానేపథ్యం ఉండటంతో సీఎం మమతా బెనర్జీ మనోజ్ తివారీని రాష్ట్ర క్రీడల మంత్రిగా నియమించారు.