ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో లక్నో టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలు చేయడంతో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృథ్వీ షా (5), వార్నర్ (3) విఫలమయ్యారు.
అయితే మిచెల్ మార్ష్ (37), రిషబ్ పంత్ (44) మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపారు. అయితే మార్ష్, పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో మళ్లీ ఢిల్లీ కష్టాల్లో పడింది. ఆర్.పావెల్ (35), అక్షర్ పటేల్ (42 నాటౌట్) పోరాడినా ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోయారు. చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం ఉండగా లక్నో ఆల్‌రౌండర్ స్టాయినీస్ బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఓడిన అనంతరం వరుసగా మూడు విజయాలు సాధించిన లక్నో జట్టు ఇప్పుడు మరోసారి వరుసగా హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో 10 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించింది.