ఐపీఎల్ 2026 సీజన్‌లో సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్ బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు జియోహాట్‌స్టార్ ప్రీ-మ్యాచ్ షోలో వైభవ్ ఇన్నింగ్స్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. వైభవ్ ప్రతిభను సన్నీ ప్రశంసించాడు. వైభవ్ సిక్సులు కొడుతుంటే చూడటం అద్భుతంగా అనిపించిందని, అయితే తాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ కాబట్టి చూడలేకపోయా అని సరదాగా చెప్పాడు.
గువాహటిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించబడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. వైభవ్ మెరుపు ఆరంభంతో రాజస్థాన్ 150/3 భారీ స్కోర్ నమోదు చేసి.. 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుమ్రా బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన సిక్సర్లు ప్రత్యేకంగా నిలిచాయి. గవాస్కర్ మాట్లాడుతూ… ‘వైభవ్ ఇన్నింగ్స్ చూడటానికి అద్భుతంగా అనిపించింది. నేను ముంబై ఇండియన్స్ అభిమాని అయినప్పటికీ.. 15 ఏళ్ల కుర్రాడు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ బౌలర్ అయిన బుమ్రా బౌలింగ్‌లో అలా ఆడటం నిజంగా గొప్ప విషయం’ అని అన్నాడు.
‘వైభవ్ సూర్యవంశీ కేవలం బెరుకు లేకుండా ఆడుతున్నాడు. అంతేకాదు బంతి లైన్అండ్ లెంగ్త్ ముందుగానే అర్థం చేసుకుని క్లియర్‌గా షాట్లు ఆడాడు. అతడు కొట్టిన సిక్సర్లు బ్యాట్ ఎడ్జ్ అవ్వలేదు. మంచి టైమింగ్‌తో, బ్యాట్ మిడిల్ నుంచి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లాయి. ఇది మెరుపు ఇన్నింగ్స్ కాదు. టెక్నిక్ పరంగా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్లు కూడా బుమ్రాను ఇలా ఎదుర్కోలేకపోయారు. కానీ వైభవ్ తొలి మూడు బంతుల్లోనే డామినేట్ చేశాడు’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. ధైర్యంతో పాటు టెక్నిక్, టైమింగ్, పవర్ అన్నీ కలిసిన అరుదైన ఇన్నింగ్స్ అని కొనియాడాడు. వైభవ్ లాంటి కుర్రాళ్లు భారత క్రికెట్ భవిష్యత్తు అని సన్నీ పేర్కొన్నాడు.