RR vs RCB Eliminator 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024లో రసవత్తర సమరానికి వేళైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో లిమినేటర్ విజేత ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. లీగ్ దశలో రాజస్థాన్, బెంగళూరుల ప్రయాణం చాలా భిన్నంగా సాగింది. టోర్నీ ఆరంభంలో రాజస్థాన్ వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. బెంగళూరు మాత్రం చివరి ఆరు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చింది.
ఐపీఎల్ 2024 లీగ్ దశలో రాజస్థాన్ బాగా ఆడింది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో చాలా రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్-2లో నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ పేలవ ఫామ్‌తో మూడో స్థానానికి పరితమైంది. వర్షం కారణంగా ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడానికి ముందు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. పేలవ ఫామ్‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. అద్భుత ఫామ్‌లో ఉన్న బెంగళూరుతో పోరు రాయల్స్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి. జోస్ బట్లర్ దూరం కావడం ఆ జట్టుకు భారీ దెబ్బ. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్‌ల ఆటపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చహల్ చెలరేగితే తిరుగుండదు.
బెంగళూరు పుంజుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓడి.. ఆఖరి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు అందుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం బెంగళూరు బ్యాటు, బంతితో చెలరేగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బెంగళూరు.. రాయల్స్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ జట్టుకు పెద్ద సానుకూలాంశం. డుప్లెసిస్, పటీదార్, కార్తీక్, గ్రీన్, మ్యాక్స్‌వెల్‌లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. సిరాజ్, దయాళ్, ఫెర్గూసన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చహల్.
బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.