Rishabh Pant Suspension By BCCI: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. సస్పెన్షన్ కారణంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు.
‘2024 మే 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేశాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్‌ను ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశాం. అంతేకాదు జరిమానా కూడా విధించాం’ అని బీసీసీఐ పేర్కొంది. పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించబడింది. ఢిల్లీ తుది జట్టులోని ఆటగాళ్లతో సహా ఇంపాక్ట్ ప్లేయర్‌కు రూ.12 లక్షలు జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (రెండింటిలో ఏది తక్కువైతే అది) కోత పడింది.
Also Read: Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!
ఏప్రిల్ 4న వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. అంతకుముందు వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. మే 7న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. దాంతో పంత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీకి ఇది భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. పట్టికలో ఢిల్లీ 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది.