Faf du Plessis Rare Reord For RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బెంగళూరు బ్యాటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పవర్ ప్లేలో ఫాఫ్ 64 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (50) పేరిట ఉంది. పవర్ ప్లేలో గేల్ మూడుసార్లు 50 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌పై ఫాఫ్ డుప్లెసిస్ 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. దాంతో బెంగళూరు తరఫున అత్యంత వేగవంతమైన హఫ్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 17 బంతుల్లోనే హఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. గేల్, డుప్లెసిస్ తర్వాతి స్థానాల్లో రాబిన్ ఉతప్ప (19), రజత్ పటిదార్ (19) ఉన్నారు.
Also Read: Romeo : విజయ్ ఆంటోని “రోమియో” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 148 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫాఫ్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టైటాన్స్ బౌలర్లపై బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఛేజింగ్‌లో డుప్లెసిస్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అతను పవర్‌ప్లే అనంతరం కాసేపు క్రీజులో ఉంటే.. బెంగళూరు 10 ఓవర్లలోనే విజయం సాధించేది.