Rajat Patidar: గుజరాత్‌ను బాడీ లాంగ్వేజ్‌తోనే బయపెట్టాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఫైనల్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో విజయం
  • ఆర్సీబీ విజయంపై కెప్టెన్ పాటీదార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Rajat Patidar Statement

Rajat Patidar Statement

Rajat Patidar About RCB Win on GT in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)ను చిత్తు చేసి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ విజయంలో కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (93; 33 బంతుల్లో 5×4, 9×6) సహా బౌలర్లు జాకబ్‌ డఫీ (3/39), రసిఖ్‌ సలామ్‌ (2/24), భువనేశ్వర్‌ (2/28) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్‌.. జట్టులో ప్రతి బ్యాటర్ దూకుడు మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాడని, అదే విజయానికి కారణమైందని వెల్లడించాడు. గుజరాత్ బౌలర్లపై ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏమీ లేదని, బాడీ లాంగ్వేజ్‌తోనే బయపెట్టాం అని చెప్పుకొచ్చాడు.

‘ఇది మాకు అద్భుతమైన మ్యాచ్. ముఖ్యంగా బ్యాటర్లు ఆడిన తీరు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏమీ లేదు. కానీ మా బాడీ లాంగ్వేజ్ మాత్రం స్పష్టంగా ఉండాలి అని అనుకున్నాం. మేము మీపై దాడికి వస్తున్నాం అనే సందేశం ప్రతి బ్యాటర్‌లో ఉంది. మ్యాచ్‌కు ముందు మీటింగ్‌లో కూడా ఇదే మాట్లాడుకున్నాం. అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఆడాలని నిర్ణయించుకున్నాం. అనుకున్న విధంగానే మా బ్యాటర్లు ఆడడంతో భారీ స్కోర్ చేశాం’ అని ఆర్సీబీ కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ చెప్పాడు.

‘నేను క్రీజులోకి రాగానే 8 నుంచి 10 బంతులు నెమ్మదిగా ఆడుతాను. పిచ్ ఎలా ఉందో, బంతి ఎలా వస్తుందో గమనిస్తాను. ఆ తర్వాత పూర్తిగా క్లియర్ మైండ్‌తో ఆడతాను. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఎప్పుడూ బౌలర్‌పై ఒత్తిడి తీసుకురావడానికే ప్రయత్నిస్తాను. ఈ మ్యాచ్‌లో కూడా అదే విధంగా ఆడి పరుగులు చేశాను. ఈ పిచ్‌లో భారీ సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదు. బౌన్స్ బాగా ఉంది. మా బౌలర్లు స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ జట్టులో టాప్-3 బ్యాటర్లు చాలా కీలకమని మాకు తెలుసు. కాబట్టి పవర్‌ప్లేలో వారిని ఔట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అదృష్టవశాత్తూ అది సక్సెస్ అయింది’ అని పాటీదార్‌ తెలిపాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా రొమారియో షెఫర్డ్‌ను తీసుకురావడంపై పాటీదార్ స్పందించాడు. ‘ఫైనల్‌కు వెళితే మిడిల్ ఓవర్లలో రొమారియో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని అనుకున్నాం. అందుకే ఈ మ్యాచ్‌లో అతడిని ఉపయోగించాం. ఫైనల్ ముందు జట్టుకు విశ్రాంతి చాలా అవసరం. ఇక ఫైనల్‌పై పూర్తి ఫోకస్ పెడుతాం. ఐపీఎల్ 2026 కప్ సాధించడమే మా లక్ష్యం’ అని పాటీదార్‌ చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. గత సీజన్‌లో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తొలి టైటిల్ గెలిచిన బెంగళూరు.. ఇప్పుడు మరోసారి కప్ అందుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కెప్టెన్‌గా పాటీదార్ ప్రశాంత నాయకత్వం, విరాట్ కోహ్లీ అనుభవం, బౌలింగ్ దళం సమిష్టి ప్రదర్శనతో ఆర్సీబీ అభిమానుల్లో టైటిల్ ఆశలు మరింత పెరిగాయి.