IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 తుది దశకు చేరుకుంది. మంగళవారం, ఫైనల్‌లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫైనల్‌పై రాజకీయం మొదలైంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కోల్‌కతా నుంచి గుజరాత్‌కి మార్చాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం ఆదివారం విమర్శించింది.
‘‘ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను ఈడెన్ గార్డెన్స్ నుంచి మార్చాలనే నిర్ణయం వెనక ఉన్న రాజకీయ ఉద్దేశ్యాల గురించి నేను గతంలో మాట్లాడాను. ఇటీవల పరిణామాలు ఈ విషయాన్ని మరింత వెలుగులోకి తెచ్చాయి’’ అని రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఈ సమయంలో వాతావరణం అంచనాలను శాటిలైట్ డేటా ఆధారంగా బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి సమర్పించింది. ఈ కాలంలో కోల్‌కతాలో వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో ప్లే ఆఫ్స్, ఫైనరల్ గుజరాత్‌కి తరలించారు’’ అని మంత్రి అన్నారు. అయితే, ఈ శాటిలైట్ డేటా కేవలం వాతావరణ పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉండటమే కాకుండా, రాజకీయం ద్వారా ప్రభావితమైట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
కోల్‌కతా క్రికెట్ అభిమానులు రాజకీయ ఉద్దేశ్యాల కారణంగా అన్యాయంగా ఫైనల్ మ్యాచ్‌కి దూరమయ్యారని, కోల్‌కతాలో వర్షం పడే అవకాశం ఉందనే అంచనా వేసిన శాటిలైట్, నరేంద్రమోడీ స్టేడియంలో వర్షం పడే అవకాశాన్ని గుర్తించడంలో విఫలమైందని బిస్వాస్ అన్నారు. ఇది కేవలం రాజకీయ ఎజెండాను చూపిస్తోందని ఆరోపించారు.
జూన్ 1, 3 తేదీలలో జరగాల్సిన రెండవ క్వాలిఫయర్, IPL ఫైనల్ వరుసగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కాకుండా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయని గతంలో బీసీసీఐ ప్రకటించింది. గతేడాది ఛాంపియన్స్ హోమ్ గ్రౌండ్ ఫైనల్‌కి ఆతిథ్యం ఇవ్వాలనే ఐపీఎల్ నియమాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందని మంత్రి బిశ్వాస్ అన్నారు.