Rohit Sharma Played 250 IPL Match After MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడడంతో రోహిత్ ఖాతాలో ఈ అరుదైన ఫీట్ చేరింది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అగ్ర స్ధానంలో ఉన్నాడు. మహీ ఇప్పటివరకు 256 మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 250 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున 45 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. ముంబై ఇండియన్స్ తరఫున 205 మ్యాచ్‌లు ఆడాడు. 250 మ్యాచ్‌ల్లో రోహిత్ 6508 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 109 నాటౌట్. తన స్పెషల్ మ్యాచ్‌లో రోహిత్ 25 బంతుల్లో 36 రన్స్ చేశాడు.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు జట్లకు మాత్రమే ఆడాడు. 2008 నుంచి 2012 వరకు దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2013 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. దశాబ్ద కాలంగా ముంబైకి సారథ్యం వహించిన హిట్‌మ్యాన్.. ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు. 2024 సీజన్ ముందు అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్.. ప్రస్తుతం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు.