Lok Sabha Electioms 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది.
మొదటి దశలో, తమిళనాడు 39, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అండమాన్ మరియు నికోబార్ దీవులు 1, మిజోరం 1, నాగాలాండ్ 1, పుదుచ్చేరి 1, సిక్కిం 1 మరియు లక్షద్వీప్ 1 ఎంపీ స్థానాలతో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటిలో పాటు అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32 సీట్లు)లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.
Read Also: MI v PBKS: ముంబై బౌలర్ల జోరు.. బెంబెలేత్తిపోయిన పంజాబ్ బ్యాటర్లు
మొదటి దశలో 16.63 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 35.67 లక్షల మంది తొలిసారి ఓటుసారి ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 3.51 కోట్ల మంది యువ ఓటర్లు, 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. వీరంతా 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
తొలి దశలో పోటీ చేస్తున్న కీలక నేతల్లో నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, సంజీవ్ బలియన్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్ మురుగన్ మరియు నిసిత్ ప్రమాణిక్ వంటి ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కోయంబత్తూర్ నుంచి తమిళనాడు బీజేపీ ఛీప్ అన్నామలై కూడా పోటీ చేస్తున్నారు. చెన్నై నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీఎంకే నుంచి కనిమెళి, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్ పోటీో ఉన్నారు.
2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రోజు జరగబోతున్న 102 స్థానాల్లో ఎన్డీయే 41 స్థానాలను గెలుచుకోగా.. యూపీఏ కూటమి 45 సీట్లను సాధించుకుంది. ఎన్నికల నిర్వహణ కోసం 102 స్థానాల్లో 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లు, 18 లక్షల పోలింగ్ సిబ్బందిని మోహరించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.