BCCI Bans Hardik Pandya in IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు గాను హార్దిక్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఓ మ్యాచ్ నిషేధంతో రూ. 30 లక్షల భారీ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఐపీఎల్ 2024లో హార్దిక్ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడోసారి.
స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు హార్దిక్ పాండ్యాకు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఆడిన ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్ సహా) రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏదీ తక్కువగా ఉంటే అది) జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ కూడా ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: Mumbai Indians: రోహిత్ శర్మ చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా!
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. 10 మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది. ముంబై చివరగా ఐపీఎల్ 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా నిరాశపరుస్తోంది. 2021, 2022లో లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించిన ముంబై.. 2023లో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఈసారి రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అప్పగించినా.. ముంబై రాత మారలేదు.