Suryakumar Yadav about Rehab in NCA ahead of IPL 2024: తాను జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదని, పునరావాసం కారణంగా బుక్ చదవక తప్పలేదని ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గత మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు చెప్పాడు. పునరావాసంలో మళ్లీ మళ్లీ అదే పనులు చేయడంతో చాలా బోరింగ్‌గా అనిపించిందని సూర్య చెప్పాడు. 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య గాయం బారిన పడ్డాడు. అప్పటినుంచి ఆటకు దూరమైన సూర్య.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై బరిలోకి దిగాడు.
నేడు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో గత మూడు నెలల్లో తాను ఏం చేశాడో వివరించాడు. ‘స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలి గాయాలు అయ్యాయి. ఒక్కో గాయం నుంచి కోలుకుంటూ.. ఇక్కడికి చేరుకున్నా. మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. గత మూడు లేదా మూడున్నర నెలల గురించి వివరించడం కొంచెం కష్టమే. మొదటి 2-3వారాలు చాలా కష్టంగా గడిచాయి. ఎందుకంటే పునరావాసంలో మళ్లీ మళ్లీ అదే పనులు చేయడం చాలా బోరింగ్‌గా అనిపించింది. కానీ 4-5 వారం నాటికి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం అని గ్రహించాను’ అని సూర్య తెలిపాడు.
Also Read: Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ
‘నేను నా భార్య, ఎన్‌సీఏలోని వ్యక్తులందరితో మాట్లాడినప్పుడు.. ఇది మీ రెండవ వెర్షన్ అని అన్నారు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు కొంచెం భిన్నంగా ఉంటారని చెప్పారు. పునరావాసంలో సరైన సమయానికి తినడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టా. ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేశా. నా జీవితంలో ఎప్పుడూ కూడా పుస్తకం చదవలేదు. ఆ పని కూడా చేయాల్సి వచ్చింది. నేను వేగంగా కోలుకునేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి’ అని సూర్యకుమార్ వివరించాడు.