KL Rahul Funny Comments on Dream11 Ad with Suniel Shetty: ఐపీఎల్ 2024 ముగిసిందని, ఇక తన మామ సునీల్ శెట్టి టీమ్‌కు వెళ్తున్నా అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ‘శర్మాజీ కా బేటా’ కోసం ప్రచారం చేయాలని రాహుల్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్ 2024 కోసం సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి రాహుల్ డ్రీమ్ 11 యాడ్ షూట్ చేశాడు. ఇందులో సునీల్ శెట్టి తన అల్లుడు రాహుల్ సారథిగా ఉన్న లక్నో జట్టుకు కాకూండా.. రోహిత్ ఆడే ముంబై ఇండియన్స్‌కు సపోర్ట్ చేస్తాడు. దాంతో రాహుల్ నిరాశ చెందుతాడు. ఈ యాడ్ గురించి రాహుల్ ఇలా ఫన్నీగా మాట్లాడాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో గెలిచింది. లక్నో 14 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘టోర్నీ నుంచి నిష్క్రమించడం చాలా నిరాశపరిచింది. ఐపీఎల్ 2024 ప్రారంభంలో లక్నో బలమైన జట్టుగా ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టమైనదిగా భావించాను. కానీ జట్టులో కొందరికి గాయాలయ్యాయి. ఇది ప్రతి టీమ్‌లో సహజమే. సమష్టిగా మేం సత్తాచాటలేకపోయాం. ఈరోజు బాగా ఆడాం. ఇదే ప్రదర్శన గత మ్యాచ్‌ల్లో చేయాల్సింది. కానీ దురుదృష్టవశాత్తు చేయలేకపోయాం’ అని అన్నాడు.
‘లక్నో జట్టులోని భారత పేసర్ల కోసం ఫ్రాంచైజీ ఎంతో ఖర్చు పెట్టింది. కేవలం రెండు నెలలు మాత్రమే కాదు.. ఏడాది మొత్తానికి ఖర్చు చేసింది. మోర్నె మోర్కెల్ దగ్గర శిక్షణ కోసం మయాంక్ యాదవ్, యుద్విర్ సింగ్‌లను దక్షిణాఫ్రికా పంపాము. అది ఫలించింది. నికోలస్ పూరన్ బాగా ఆడాడు. అంతర్జాతీయ ఆటగాళ్లు ఒత్తిడి జయించాలని అనుకున్నాం. నా బ్యాటింగ్ గురించి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు పెద్దగా టీ20 మ్యాచ్‌లు లేవు. పొట్టి ఫార్మాట్‌లో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవాలి. ఏ స్థానంలో అని ఇంకా తెలియదు. నేను ఇప్పుడు మా నాన్నగారి టీమ్‌లో ఉన్నాను. ప్రపంచకప్‌లో శర్మాజీ కా బేటా కోసం మేమిద్దరం సపోర్ట్ చేస్తాం’ అని లోకేష్ రాహుల్ తెలిపాడు.