Vaibhav Sooryavanshi: గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసిన వైభవ్, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒకే టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఈ ‘యూనివర్స్ బేబీ బాస్’.. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా, అతి పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కేవలం 68 పరుగుల దూరంలో ఉన్నాడు.

2025లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 932 పరుగులు సాధించాడు. ఈ 932 పరుగుల కోసం అతను ఎదుర్కొన్నది కేవలం 402 బంతులు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ స్టార్ ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో టిమ్ డేవిడ్ (560 బంతులు) ఉన్నాడు. వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 142 బంతుల లీడ్ ఉంది. అతని ప్రస్తుత ఫామ్, స్ట్రైక్ రేట్ చూస్తుంటే.. రస్సెల్ రికార్డు కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఏజ్ విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేరిట ఉంది. పంత్ 20 ఏళ్ల 281 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకోగా.. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించబోతున్నాడు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో హైదరాబాద్‌పై సెంచరీ చేసినప్పుడు.. అత్యంత చిన్న వయసులోనే ఓవరాల్ టీ20ల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ పంత్ రికార్డును తుడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో వైభవ్ మరోసారి చెలరేగితే రికార్డుల వేట సాకారం కానుంది.

×
×
Ad