Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: నిన్న రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. “222 పరుగులు అంటే అది అద్భుతమైన స్కోరు. బ్యాటర్లు తమ పనిని పక్కాగా పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ పిచ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ వారు అదరగొట్టారు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే, ప్రణాళికలను అమలు చేయడంలో మేము విఫలమయ్యాం. స్లోయర్ బంతులు, యార్కర్లు వేయాలని అనుకున్నా, మైదానంలో అది సరిగ్గా జరగలేదు. రాజస్థాన్ బ్యాటర్లు ఫెరీరా, శుభమ్ దూబే చివర్లో అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు” అని అయ్యర్ విశ్లేషించాడు.

బౌలర్ల కష్టాల గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుత ఫార్మాట్‌లో బ్యాటర్లు మొదటి బంతి నుండే విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో బౌలర్లకు ప్రణాళికలు అమలు చేయడం కష్టతరమైన పనే. కానీ అంతిమంగా అది ఎగ్జిక్యూషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు మా బౌలర్లకు అది కలిసిరాలేదు” అని పేర్కొన్నాడు. వరుస ప్రయాణాలు, మ్యాచ్‌ల వల్ల శరీరం కొంత అలసిపోయిన మాట వాస్తవమే అయినా, దాన్ని సాకుగా చెప్పదలచుకోలేదని అన్నాడు. ఈ సీజన్‌లో ఇది తమకు మొదటి ఓటమి అని గుర్తుచేసిన అయ్యర్, ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. తాము ఇప్పటికే 200 పైచిలుకు లక్ష్యాలను ఛేదించామని, కాపాడుకున్నామన్నారు. ఇది కేవలం తమకు కలిసిరాని రోజు మాత్రమే అని తెలిపాడు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ ప్రదర్శనను అయ్యర్ ప్రత్యేకంగా అభినందించాడు. ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడుతున్న బ్రార్ కేవలం 25 పరుగులే ఇచ్చి (4 ఓవర్లలో) అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడని కొనియాడాడు. అతని వైఖరి, పట్టుదల అద్భుతమని కొనియాడాడు. రెండు రోజుల విరామం తర్వాత మళ్ళీ కొత్త ఉత్సాహంతో పుంజుకుంటామని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.