Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు కూడా అద్భుతంగా ఆడాయని, ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు మంచి ఆరంభం లభించినా, తాము తిరిగి పుంజుకున్న తీరు బాగుందని మెచ్చుకున్నాడు. అయితే చివర్లో కొన్ని క్యాచ్‌లు చేజార్చడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డామని, ప్రస్తుత రోజుల్లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం మరింత సవాలుగా మారిందని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
గత మ్యాచ్‌లో బంతికి మంచి వేగం లభించగా, ఈ మ్యాచ్‌లో బంతి ఆగుతూ (holding up), కాస్త తక్కువ ఎత్తులో (low) వస్తోందని గమనించినట్లు బుమ్రా వెల్లడించాడు. అందుకే దానికి తగ్గట్టుగానే తాము ప్రణాళికలు మార్చుకున్నామని తెలిపాడు. లెంగ్త్ బాల్స్ వేయడమే ఈ పిచ్‌పై కీలకమని బౌలర్లంతా చర్చించుకున్నట్లు బుమ్రా పేర్కొన్నాడు. మైదానం ఎత్తులో ఉంది. కాబట్టి, మరీ షార్ట్ లేదా మరీ ఫుల్ డెలివరీలు వేస్తే బంతి గాల్లోకి ఎగిరిపోతుందన్నాడు. అందుకే మంచి లెంగ్త్‌ను నమ్ముకోవాలని నిర్ణయించుకున్నామని.. బ్యాటర్లు మంచి షాట్లు ఆడినా సరే, మనం బేసిక్స్ మార్చకుండా బౌలింగ్ చేయడమే ముఖ్యమని బౌలర్లకు చెప్పినట్లు తెలిపాడు. వారంతా ఆ ప్రణాళికను అద్భుతంగా అమలు చేశారని మెచ్చుకున్నాడు.
ఈ విజయంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ ప్రధాన పాత్ర పోషించాయని బుమ్రా కొనియాడాడు. “ఒకవైపు వికెట్లు పడుతున్నా, సహచరులు సహకరించకపోయినా తిలక్ తనపై నమ్మకంతో నిలబడి మ్యాచ్‌ను ముగించిన తీరు అద్భుతం. అలాగే చివర్లో విల్ జాక్స్ (Jacksy) ఇచ్చిన సహకారం చిన్నదైనా, టీ20ల్లో దాని ప్రభావం చాలా పెద్దది. అందరూ సమిష్టిగా రాణించడం సంతోషాన్నిచ్చింది” అని తెలిపాడు. ఇక గతంలో టెస్టులు, టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న బుమ్రా, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ను నడిపించడంపై సరదాగా స్పందించాడు. ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీ మాత్రమే. కానీ అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు అని నవ్వుతూ చెప్పాడు. ఏదేమైనా, ఈ మైదానంలో ఈ వాతావరణంలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించడం చాలా సరదాగా అనిపించిందని వెల్లడించాడు.
