Shubman Gill Reply To Harsha Bhogle On GT Win: ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం తమ జట్టు లక్షణమని, ప్రత్యర్థులెవరూ తమను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెచ్చరించాడు. రషీద్ ఖాన్ అద్భుతమైన ప్లేయర్ అని, అతడి లాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుందన్నాడు. చివరి బంతికి గెలవడం ఎప్పుడూ గొప్ప అనుభూతి అని గిల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గుజరాత్ గెలిచింది. శుభ్‌మన్ గిల్ (72), సాయి సుదర్శన్ (35), రషీద్ ఖాన్ (24 ), రాహుల్ తెవాతియా (22) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం కామెంటేటర్ హర్షా భోగ్లే వ్యాఖ్యలకు శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాలా బాగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. విజయం సాధించినందుకు అభినందనలు. అయితే ఇంకాస్త ముందుగానే గెలవాల్సిన మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్తారని కొందరు అంటున్నారు’ అని హర్షా భోగ్లే అనగా.. ‘ధన్యవాదాలు. మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం జట్టు లక్షణం’ అని గిల్ కౌంటర్ వేశాడు.
Also Read: Sanju Samson Fine: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్!
మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘చివరి 3 ఓవర్లలో 45 పరుగులు అసవరం అయ్యాయి. ఇది పెద్ద కష్టమేం కాదు. అలాంటి మైండ్ సెట్‌తో ఆడాం. గణాంకాల ప్రకారం.. క్రీజ్‌లోని ఇద్దరు బ్యాటర్లు ఒక్కొక్కరు 9 బంతుల్లో 22 పరుగులు చేస్తే సరిపోతుంది. అందులో ఒకరు దూకుడుగా ఆడితే మరింత సులువుతుంది. ఓవర్‌లో 2-3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా అదే చేశారు. నేను గేమ్‌ను పూర్తి చేయడానికి ఇష్టపడతాను. కానీ ఈసారి రషీద్, తెవాతియా పనిని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చివరి బంతికి మ్యాచ్ గెలవడం ఎప్పుడూ గొప్ప అనుభూతి. చివరి బంతికి రషీద్ ఫోర్ కొట్టడం అద్భుతం. గత మ్యాచ్‌లోనూ 50 శాతం వరకు మేం ఆధిపత్యం ప్రదర్శించి.. చివర్లో ఇబ్బంది పడి కోల్పోయాం. రషీద్ అద్భుతమైన ప్లేయర్. అతడి లాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది’ అని గిల్ తెలిపాడు.