RR vs RCB Head To Head at Narendra Modi Stadium in IPL: ఐపీఎల్ 2024లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే.. తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.
ఆశలు లేని స్థితి నుంచి వరుసగా ఆరు విజయాలతో బెంగళూరు ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చింది. డుప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ మీద ఉండటం ఆర్‌సీబీకి కలిసి రానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇప్పుడు ఆర్‌సీబీ భీకరంగా ఉంది. మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్ ప్రథమార్ధంలో వరుసగా గెలిచిన రాజస్థాన్.. ఆ తర్వాత ఓటములతో టాప్-4లో నిలిచింది. శాంసన్ సారథ్యంలోని ఆర్ఆర్ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఐపీఎల్‌లో బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 15 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఆర్ఆర్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకేసారి తలపడగా.. రాజస్థాన్ గెలిచింది. నరేంద్ర మోడీ స్టేడియంలో బెంగళూరు, రాజస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడి.. చెరో విజయం సాధించాయి. చిన్నస్వామి స్టేడియం, సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలలో రాజస్థాన్ రికార్డు మెరుగ్గా ఉంది.
Also Read: RR vs RCB Eliminator: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. ఇంటికి వెళ్లేదెవరో?
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోటీల్లో రెండు సార్లు తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్, బెంగళూరు ఒకసారి గెలిచాయి. బెంగళూరుపై రాజస్థాన్ అత్యధిక స్కోర్ 217 కాగా.. అత్యల్ప స్కోర్ 41. రాజస్థాన్‌పై బెంగళూరు అత్యధిక స్కోర్ 200.. అత్యల్ప స్కోర్ 62.