Harbhajan Singh Fires on MS Dhoni: ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై ఖాతాలో 12 పాయింట్స్ ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచినా.. యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే పంజాబ్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు.
హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ బోల్డ్ కాగా.. ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. హర్షల్ వేసిన స్లో డెలివరీకీ ధోనీ కూడా బౌల్డ్ అయ్యాడు. మహీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై చెన్నై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. తొమ్మిదో స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు రావడం కంటే.. తుది జట్టు నుంచి తప్పుకోవడమే ఉత్తమం అని పేర్కొన్నాడు. ధోనీ కి బదులుగా మరో ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్ ముందు చెన్నైకి భారీ ఎదురుదెబ్బ!
స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. తుది జట్టులో ఆడకపోవడమే ఉత్తమం. అతని స్థానంలో ఓ ఫాస్ట్ బౌలర్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోవడం మంచిది. ధోనీ డెసిషన్ మేకర్. ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి జట్టును నిరాశపరిచాడు. ధోనీలా శార్దూల్ ఠాకూర్ భారీ షాట్లు ఆడలేడు. ధోనీ ఎందుకు ఈ తప్పు చేశాడో నాకు అర్థం కావడం లేదు. అతని అనుమతి లేకుండా చెన్నై జట్టులో ఏదీ జరగదు. ధోనీ ఆఖర్లో బ్యాటింగ్‌కు వెళ్లాలనే నిర్ణయాన్ని ఇతరులు తీసుకున్నారని నేను భావించట్లేదు’ అని అన్నాడు.