Fans Try To Buy Tickets for MS Dhoni in Uppal Stadium: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఎంఎస్ ధోనీ’ నామస్మరణే. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండడం ఒకటైతే.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతుండడం రెండోది. అందుకే ఐపీఎల్ 2024లో ధోనీ ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మిస్టర్ కూల్ ఏ నగరానికి వెళ్లినా.. స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది.
శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనీ హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడుతుండటంతో.. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నతస్థాయి అధికారుల వరకు టికెట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. ఆన్‌లైన్‌లో ఉంచిన టికెట్లు నిమిషాల్లో మాయమవడంతో.. అభిమానులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
సాధారణంగా ఏ నగరంలో అయినా ఉన్నతాధికారులకు ఐపీఎల్ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు ఇస్తుంటారు. అయితే నగరానికి ఎంఎస్ ధోనీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్, చెన్నై మ్యాచ్ టికెట్ల డిమాండ్‌ను ముందే ఊహించిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.. చాలా తక్కువ సంఖ్యలో ఆన్‌లైన్‌లో టికెట్లను అమ్మినట్లుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. 35 వేల సామర్థ్యమున్న ఉప్ప్పల్ స్టేడియం టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిని కాంప్లిమెంటరీ పాసులుగా ముద్రించి.. బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టికెట్ రూ.10 కూడా పలుకుతోందట.
Also Read: CSK vs SRH: కరెంట్ పునరుద్ధరణ.. ఉప్పల్ స్టేడియంలో యధావిధిగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్!
బ్లాక్ టికెట్ల వ్యవహారంపై మీడియాలో కథనాలు వస్తున్నా.. పట్టించుకున్న వారే లేరు. హెచ్‌సీఏ అధికారులు కూడా మిన్నకుండిపోయారు. టికెట్ల గురించి హెచ్‌సీఏ మాట కూడా మాట్లాడం లేదు. మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టారు, వాటిని ఎవరు కొన్నారు? అనే వివరాలు ఆన్‌లైన్ సంస్థ, సన్‌రైజర్స్, హెచ్‌సీఏ దగ్గర ఉంటాయి. కానీ ఇప్పటివరకు టికెట్ల విక్రయాల గురించి ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టే అర్ధంమవుతోంది బ్లాక్ టికెట్ల దందా ఏ రేంజ్‌లో సాగుతోందో.