Site icon NTV Telugu

Praful Hinge-Vaibhav: హాట్సాఫ్ ప్రఫుల్ హింగే.. చెప్పినట్టే మొదటి బంతికే ‘బుడ్డోడి’ వికెట్ తీశావ్!

Praful Hinge Vaibhav

Praful Hinge Vaibhav

గత రెండేళ్లుగా భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025, దేశవాళీ టోర్నీలు, అండర్ 19 ప్రపంచకప్ 2026లో బుడ్డోడు వైభవ్‌ అదరగొట్టాడు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన అతడు.. అంతకుమించి ఆడాడు. ఇండియన్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కూడా సునాయాసంగా సిక్సులు బాదాడు. అంతంత మాత్రమే ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌పై వైభవ్ ఊచకోత ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. మొదటి బంతికే పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. హింగే ధాటికి వైభవ్‌ సూర్యవంశీ, ధ్రువ్‌ జురెల్‌, ప్రిటోరియస్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో టాప్ బౌలర్లనే ఓ ఆటాడుకుంటున్న వైభవ్‌.. మొదటి బంతికే డకౌట్ అందరినీ విస్మయానికి గురిచేసింది.

Also Read: Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!

వైభవ్‌ సూర్యవంశీని మొదటి బంతికే అవుట్ చేస్తానని చెప్పిన ప్రఫుల్ హింగే.. చెప్పినట్లే అవుట్ చేశాడు. మ్యాచ్‌లో తనకు అత్యంత ఇష్టమైన వికెట్ గురించి మాట్లాడుతూ.. ఫామ్‌లో ఉన్న సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేయడం ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ఆ వికెట్ కోసం ముందే ప్రణాళిక వేసుకున్నానని, బౌన్సర్‌తో అయినా ఔట్ చేస్తానని జట్టులో కొందరికి ముందే చెప్పానని తెలిపాడు. ‘వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి బంతికే సూర్యవంశీని ఔట్ చేస్తానని నేను జట్టులోని కొందరికి ముందే చెప్పాను. బౌన్సర్‌తో అయినా లేదా ఎలా అయినా వికెట్ పడగొడుతా అని చెప్పా. వైభవ్ వికెట్ పడడం చాలా సంతోషంగా ఉంది’ అని హింగే చెప్పాడు. హైదరాబాద్ ఫాన్స్ హింగేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హాట్సాఫ్ ప్రఫుల్ హింగే’, ‘చెప్పినట్టే మొదటి బంతికే బుడ్డోడి వికెట్ తీశావ్ హింగే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version