ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..

Jonty Rhodes

Jonty Rhodes

ICC Cricket World Cup 2027: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 2027 ప్రపంచకప్‌లో ఆ లోటును పూడ్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ప్రాధాన్యాన్ని జాంటీ రోడ్స్ వివరించారు. ప్రపంచకప్‌ వంటి అత్యున్నత స్థాయి టోర్నమెంట్‌లో కేవలం ప్రతిభ, మంచి ఫామ్ ఉంటే సరిపోదని రోడ్స్ అన్నారు. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునే మానసిక బలం కూడా ఆటగాళ్లకు అవసరమని పేర్కొన్నారు. తాను నాలుగు ప్రపంచకప్‌లలో ఆడిన అనుభవంతో, ఆ టోర్నమెంట్‌లలో ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ఆటగాళ్లు శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ మానసిక దృఢత్వం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం టీమ్‌ఇండియాకు అదనపు బలాన్ని ఇస్తుందని రోడ్స్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విరాట్ కోహ్లీని నిజమైన మ్యాచ్ విన్నర్‌గా ప్రశంసించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాదిరిగానే కోహ్లీకి కూడా మ్యాచ్‌లను గెలిపించాలనే తపన ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని పేర్కొన్నారు. మైదానంలో పోటీ పడటాన్ని కోహ్లీ ఎంతగానో ఇష్టపడతారని, అతని దూకుడు వైఖరే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుందని జాంటీ రోడ్స్ అన్నారు. ప్రపంచకప్‌ వంటి పెద్ద వేదికపై ఇలాంటి మానసిక లక్షణాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

ఇక యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంపైనా రోడ్స్ కీలక సూచనలు చేశారు. కెప్టెన్ అంటే ప్రతిదీ ఒంటరిగా చేయడం కాదని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి సలహాలు తీసుకునే స్వేచ్ఛ గిల్‌కు ఉండాలని సూచించారు. అయితే, చివరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్‌పైనే ఉంటుందని, అదే నాయకత్వంలో అత్యంత కష్టమైన అంశమని పేర్కొన్నారు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్కడి పరిస్థితులు భారత జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశముందని రోడ్స్ తెలిపారు. దక్షిణాఫ్రికా పిచ్‌లు ప్రస్తుతం బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తున్నాయని, బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుందని చెప్పారు.

భారత బ్యాటర్లు ప్రస్తుతం స్కూప్, ర్యాంప్ వంటి ఆధునిక షాట్లను సమర్థంగా ఆడుతున్నారని, ఈ తరహా బ్యాటింగ్ దక్షిణాఫ్రికా పిచ్‌లపై టీమ్‌ఇండియాకు గణనీయమైన ప్రయోజనం కలిగించవచ్చని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా రోహిత్ అనుభవం, కోహ్లీ విజయం కోసం చూపించే తపన, గిల్ నాయకత్వం, భారత బ్యాటర్ల ఆధునిక ఆటతీరు.. 2027 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.