Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్‌లపై స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు రెజ్లర్లను తిడుతూ, కొడుతున్నారని భజరంగ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫోగాట్ చెప్పారు. అధికారుల ప్రవర్తనతో విసిగిపోయిన రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పూనియా, ఫోగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు.
Read Also: Kajol Devgan: భర్త లేనప్పుడు అతడితో కాజోల్ లిప్ కిస్.. మరీ నాలుగుసార్లా..?
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెజ్లర్లు మాట్లాడారు. ‘ఫెడరేషన్‌లో ఉన్నవారికి ఆట గురించి అస్సలు తెలియదు. బ్రిజ్ భూషణ్ మమ్మల్ని తిట్టాడు, కొట్టాడు కూడా. మా పోరాటం ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై కాదు. కేవలం రెజ్లింగ్ ఫెడరేషన్‌పైనే’ అని భజరంగ్ చెప్పాడు. ‘మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్, జాతీయ కోచ్‌లు లైంగికంగా వేధిస్తున్నారు. నేను ఎందుకూ పనికిరానని తిట్టారు. దీంతో నేను మానసికంగా కుంగిపోయా. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో నన్ను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి’ అంటూ ఫోగాట్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. వినేశ్ ఫోగాట్ తప్ప మరెవరూ అధికారులు లైంగికంగా వేధించారని చెప్పలేదని తెలిపారు. ఇదే నిరూపిస్తే తాను ఉరి వేసుకుంటానని చెప్పారు. 2011 నుంచి బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.