Indian Women Team Won Against Barbados In Commomwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన తాడోపేడో టీ20 మ్యాచ్‌లో.. బార్బడోస్‌పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుని చిత్తు చేసి.. సెమీస్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన బార్బడోస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భారత అమ్మాయిలు.. మొదట్నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్ స్మృతి మందాన 5 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిస్తే.. షెఫాలీ వర్మ (43)తో కలిసి రోడ్రిగ్స్ (56) పరుగుల వర్షం కురిపించింది. రెండో వికెట్‌కి వీళ్లిద్దరు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
అయితే.. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడ్డాయి. ఇది భారత జట్టుపై కాస్త ఒత్తిడి పెంచింది. ఆ సమయంలో వచ్చిన దీప్తి శర్మ (34).. రోడ్రిగ్స్‌తో కలిసి ఆచితూచి ఆడింది. వికెట్ పడకుండా 70 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తద్వారా.. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్, ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటిని తట్టుకోలేక, వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి జట్టులో కైషోన నైట్ చేసిన 16 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు అంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరు మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైతే, మరో ఇద్దరు డకౌట్ అయ్యారు. షంకేరా సెల్మాన్ చేసిన 12 పరుగులు రెండో అత్యధిక వ్యక్తిగతం.
ప్రత్యర్థి జట్టులో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. భారత బౌలర్ల దెబ్బకు బార్బడోస్ 62 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా.. భారత మహిళల జట్టు 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకోగా, మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్-ఏ లో సెమీస్‌కు దూసుకెళ్లింది.