తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్‌కు విశ్వ దీనదయాళన్ తన ముగ్గురు సహచర క్రీడాకారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న 12 చక్రాల ట్రైలర్, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి షాంగ్‌బంగ్లా వద్ద వాహనాన్ని ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది.
టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) విడుదల చేసిన వివరాల ప్రకారం.. టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. దీనదయాళన్ మరణించినట్లు నాంగ్‌పో సివిల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. అతని సహచరులు రమేష్ సంతోష్ కుమార్, అభినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్ మరియు కిషోర్ కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఛాంపియన్‌షిప్‌ల నిర్వాహకులు వారికి మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS)కి తరలించారు. దీనదయాళన్ అనేక జాతీయ ర్యాంకింగ్ టైటిళ్లు మరియు అంతర్జాతీయ పతకాలు సాధించిన టాలెంటెడ్ ఆటగాడు. ఏప్రిల్ 27 నుండి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ యూత్ కంటెండర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. విశ్వ దీనదయాళన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.