India Will Not Participate Asia Cup 2023 If It Held In Pakistan: వచ్చే ఏడాదిలో ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాల్గొనదని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ 91వ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం) సందర్భంగా.. జై షా ఈమేరకు ప్రకటన చేశారు. ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలా కాకుండా పాక్‌లోనే నిర్వహిస్తామని పట్టుబడితే మాత్రం భారత్ ఆ టోర్నీలో పాల్గొనదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పాక్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. పాక్‌లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, కేంద్రానికి వ్యతిరేకంగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని షా స్పష్టం చేశారు. యూఏఈ లాంటి తటస్థ వేదికలోనే ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించబడిందని కూడా జై షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా.. ఆసియా కప్ 2023 వన్డే టోర్నీ పాకిస్తాన్లో జరిగితే, భారత్ పాల్గొంటుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. బోర్డు సభ్యులు సైతం ఇందుకు సమ్మతి తెలిపినట్లు ప్రచారం జరిగింది. కానీ.. ఆ వార్తల్లో వాస్తవం లేదని జై షా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. పాక్‌లో పర్యటించేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ దెబ్బతో.. తమ దేశంలో భారత్ అడుగుపెడితే బాగా కూడబెట్టుకోవచ్చన్న పాక్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లినట్టైంది. ఇదిలావుండగా.. ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలో జరగాల్సింది. కానీ, అక్కడ ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో లంక బోర్డు చేతులేత్తేసింది. దీంతో చివరికి నిమిషంలో వేదికను యూఏఈకి మార్చాల్సి వచ్చింది. ఇక ఈ టోర్నీలో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే! మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో, శ్రీలంక ఫైనల్‌కి చేరడమే కష్టమని అంతా భావించారు. కానీ.. అందరి అంచనాల్ని తిప్పికొడుతూ భారత్, పాక్‌లాంటి పెద్ద జట్టుల్ని సైతం వెనక్కు నెట్టేసి, ఆసియా కప్ కొట్టేసింది.