Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఈ మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత మహిళల ముందు 100 పరుగుల టార్గెట్ నిలిచింది.
Read Also: Danish Kaneria: పాకిస్థాన్ మాజీ బౌలర్ సందేహాలు.. ఆసియా కప్‌కు కూడా కోహ్లీని పక్కన పెడతారేమో?
పాకిస్థాన్ ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులు చేసింది. జట్టులో ఆమె టాప్ స్కోరర్. మరో ఓపెనర్ జావేద్‌ను భారత బౌలర్ మేఘనా సింగ్ డకౌట్ చేసింది. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా 17 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. ఒమైమా సొహైల్ (10), అయేషా నసీమ్ (10), అలియా రియాజ్ (18) ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. పాకిస్థాన్ జట్టు ముఖ్యంగా చివరి 8 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా 2 వికెట్లు, రాధా యాదవ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ తలో వికెట్ సాధించారు. కాగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం చాలా ముఖ్యం.