NTV Telugu Site icon

Asia Cup 2022: భారత్‌, పాక్‌ జట్లకు కష్టాలు..!

Asia Cup 2022

Asia Cup 2022

ఆసియా కప్‌కు ముందు భారత్‌, పాకిస్థాన్‌ జట్లకు షాక్‌ తప్పేలా లేదు. ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇండియా- పాకిస్థాన్‌తోపాటు మిగతా నాలుగు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే టోర్నీలో ఫేవరెట్ జట్లుగా దాయాది దేశాలు భారత్‌- పాకిస్థాన్‌ ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు… ఈనెల 28న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఆసియా కప్‌కు ముందు పాక్‌కు షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగానే భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌కు కూడా బూమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. టీ-టంట్వీ వరల్డ్‌ కప్‌కు భారత జట్టును ప్రకటించడానికి ఇంకా నెల రోజుల సమయమే మిగిలుంది. ఇలాంటి పరిస్థితుల్లో బూమ్రా గాయం బీసీసీఐని ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్

మరోవైపు పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్ షా అఫ్రిది కూడా ఆసియా కప్‌లో భారత్‌తో జరగబోయే మ్యాచ్‌కు ఆడటం అనుమానమే! మోకాలి గాయం కారణంగా షాహీన్‌ షా అఫ్రిది రాబోయే నెదర్లాండ్స్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఆసియా కప్‌కు ముందు అఫ్రిది గాయం బారిన పడటంతో.. పాక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. 2022 ఆసియా కప్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టు ఈనెల 20న దుబాయ్‌ వెళ్లనుంది. యూఏఈకి వెళ్లేముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంది. దుబాయ్ వెళ్లాక… అక్కడ మూడు రోజుల శిక్షణా శిబిరం కూడా ఉంటుంది. ఈనెల 28న జరగనున్న దాయాదుల పోరును ఆస్వాదించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.