Congress interim president Sonia Gandhi tests positive for COVID19: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో చికిత్స తీసుకున్నారు సోనియాగాంధీ. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు జూన్ మొదటివారంలో కరోనా బారిన పడ్డారు సోనియా గాంధీ. ఆ సమయంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆ సమయంలో ఈడీ విచారణకు హజరుకాలేదు సోనియా గాంధీ. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ జూన్ నెలలో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమయంలో సోనియా కరోనా బారినపడటంతో విచారణ వాయిదా పడింది. సోనియా గాంధీ పూర్తిగా కోలుకున్న తరువాత జూలైలో ఈడీ విచారించింది.
Read Also: Gross Domestic Product :దేశం ఎందుకు అప్పులకుప్పగా మారుతోంది..? ఇండియా మరో శ్రీలంక అవుతుందా.?
అయితే నెల రోజులు గడవక ముందే సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడటం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల సోనియా గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలోని ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ ఆందోళనల తరువాత నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు కరోనా బారిన పడుతున్నారు.
సోనియా, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడ్దారు. ఈ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ సోకినట్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.