IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!

Ind Vs Sl Test Series

Ind Vs Sl Test Series

IND vs SL Warm-Up Match Shortened: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా సన్నాహకాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత జట్టు శ్రీలంకలో స్థానిక జట్టుతో ఆడాల్సిన వార్మప్ మ్యాచ్‌ను నాలుగు రోజుల నుంచి మూడు రోజులకు కుదించినట్లు సమాచారం. తొలుత నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి 9 వరకు మాత్రమే ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మార్పు గురించి బీసీసీఐతో పాటు భారత జట్టు యాజమాన్యానికి కూడా సమాచారం అందించినప్పటికీ.. దీనికి గల కారణాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానానికి సమీపంలో ఉన్న ఎన్‌సీసీ గ్రౌండ్‌లో ఈ వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్ష ప్రసారం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ భారత ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా బ్యాటర్లు, స్పిన్నర్లు మ్యాచ్ పరిస్థితులకు తగిన విధంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.

భారత్‌కు శ్రీలంక టెస్టు సిరీస్ అత్యంత కీలకంగా మారింది. గతేడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్టు ఆగస్టు 19 నుంచి జరగనుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడబోతోంది. చివరిసారిగా 2017లో శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడింది. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ గణాంకాలు కూడా భారత జట్టుకు ఊరట కలిగిస్తున్నాయి.