ICC Punished Fareed Ahmad and Asif Ali For Breaching Code Of Conduct: క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ సాధారణమే. కానీ, అంతకుమించి హద్దుమీరితే మాత్రం చర్యలు తప్పవు. ఫీజుల్లో నుంచి కోత విధించడమో, కొన్నిసార్లు పలు మ్యాచ్ నుంచి ప్లేయర్లను నిషేధించడమో జరుగుతుంటుంది. అయితే.. ఏదో పెద్ద వివాదం జరిగితే తప్ప ఫలానా ఆటగాళ్లపై బ్యాన్ విధించరు. సాధ్యమైనంత వరకు జరినామాలే వేస్తుంటారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు చెందిన ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి జరిమానా విధించింది. వారి ఫీజుల్లో నుంచి 25% కోత వేసింది.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బుధవారం (సెప్టెంబర్) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ, ఫరీద్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! 19వ ఓవర్‌లో చివరి బంతికి అలీని ఔట్ చేసిన తర్వాత, ఫరీద్ అతని మీదకి జోష్‌తో వెళ్లాడు. చాలా దగ్గరగా వెళ్లి, నిన్ను ఔట్ చేశాను అనే సంజ్ఞతో గట్టిగా కేకలు వేశాడు. అసలే ఔట్ అయిన బాధలో ఉన్న అలీ, అతని చర్యతో కోపాద్రిక్తుడై అతనిపై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అప్పుడు వెంటనే ఆఫ్ఘన్ ఆటగాళ్లు జోక్యం చేసుకొని, ఇద్దరిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఇలా ఫరీద్, ఆసిఫ్ నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం వల్ల.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వారిపై చర్యలు తీసుకుంది. ఇద్దరి ఫీజుల్లో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం.. ఆర్టికల్ 2.6ను ఆసిఫ్ అలీ, ఆర్టికల్ 2.1.12 రూల్స్‌ను ఫరీద్ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది. ఇక ఆ ఇద్దరు ప్లేయర్లు కూడా తాము తప్పు చేసుకున్నట్టు అంగీకరించారు. కాగా.. ఈ ఘటనతో పాటు పాక్ చేతిలో ఆఫ్ఘన్ ఓడిపోవడంతో, ఆఫ్ఘన్ అభిమానులు మైదానంలోనే పాక్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడిన విషయం విదితమే!