ఈ ఏడాది ఐపీఎల్లో రెండు కొత్త జట్లు అడుగుపెట్టబోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ అందులో ఒకటి. పేపర్ మీద ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరి ప్రధాన టోర్నీలో ఎలా రాణిస్తుందో అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రూ.7,090 కోట్లతో సంజీవ్ గోయెంకా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. రూ.17 కోట్లు ఖర్చు చేసి కేఎల్ రాహుల్‌ను మెగా వేలం కంటే ముందే తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు గతంలో కోల్‌కతాకు రెండుసార్లు టైటిల్ అందించి దూకుడుగా వ్యవహరించే గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకున్నారు.
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఓపెనర్, కెప్టెన్, వికెట్ కీపర్‌గా రాహుల్ తన సేవలు అందించనున్నాడు. అతడితో పాటు క్వింటన్ డికాక్ ఓపెనింగ్‌కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాయినీస్, జాసన్ హోల్డర్ రూపంలో మంచి ఆల్‌రౌండర్లు కూడా లక్నో జట్టుకు ఉన్నారు. బ్యాటింగ్‌లో మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా కీలకం కానున్నారు.
బౌలింగ్ విషయానికి వస్తే అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ లాంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. స్టాయినీస్, హోల్డర్, హుడా, కృనాల్ పాండ్యా కూడా బౌలింగ్ వేయగలరు కాబట్టి బౌలింగ్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడు దూరమైతే బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్‌ను తీసుకోవాలని లక్నో జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.