2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి సత్తా చాటిన క్రికెటర్లలో హర్షల్ పటేల్ ఒకడు. ఈ సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా అతడు నిలిచాడు. అయినా ఆర్‌సీబీ జట్టు హర్షల్ పటేల్‌ను రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ స్పందించాడు. 2022 రిటెన్షన్‌లో తన పేరు ఉండదని తనకు ముందే తెలుసని అతడు వెల్లడించాడు. ఆర్‌సీబీ జట్టు డైరెక్టర్ మైక్ హెస్సెన్ తనకు కాల్ చేసి విషయం చెప్పారని.. పర్స్ మేనేజ్‌మెంట్ కోసం తనను రిటైన్ చేసుకోవడంలేదని వివరించారని పేర్కొన్నాడు.
అయితే 2022 వేలంలో తనను ఆర్‌సీబీ కొనుగోలు చేస్తుందన్న నమ్మకం ఉందని హర్షల్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 తనకు చాలా స్పెషల్ అని… ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తనను ఆర్‌సీబీ టీమ్ ట్రేడ్ చేసుకోవడానికి చాలా హోమ్‌వర్క్ చేసిందన్నాడు. తన టాలెంట్‌ను గుర్తించి డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారతానని ఆర్‌సీబీ భావించిందని.. తనకు కూడా అదే విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ వివరించిందన్నాడు. అయితే వచ్చే వేలంలో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని హర్షల్ అన్నాడు. ఏ టీమ్ తనను తీసుకున్నా 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానన్నాడు.
అయితే ఐపీఎల్ 2021లో చెన్నైతో మ్యాచ్ సందర్భంగా తన బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో జడేజా 37 పరుగులు చేయడాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని హర్షల్ చెప్పాడు. ఆరోజు తాను చాలా పెద్ద తప్పు చేశానని… మొదటి రెండు బంతులు వేసి అనవసర ఒత్తిడికి లోనయ్యానని పేర్కొన్నాడు. అప్పటికే జడేజా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని.. తాను ఒక్క యార్కర్ కూడా వేయలేకపోవడం దురదృష్టకరమన్నాడు. ఆ రోజు చేసిన తప్పు మళ్లీ ఎప్పటికీ చేయకూడదని ఫిక్స్ అయ్యానని హర్షల్ వ్యాఖ్యానించాడు. ఆ ఒక్క ఓవర్ కారణంగా తాను చెడ్డ బౌలర్‌ను కాదని.. అది ఓ అనుభవమని వివరించాడు.
Read Also: రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్