అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే లోపే టీమిండియా లో చోటు కూడా దక్కించుకున్నాడు.
అతడెవరో కాదు అతడే భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అక్కరకు వచ్చే బౌలింగ్ అతడిని టీమిండియాలో పాతుకుపోయేలా చేశాయి. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ అతడిలోని ఫినిషర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ వెన్నెముక గాయం బారిన పడ్డాడు హార్దిక్. అక్కడి నుంచి అతడి ఆట గాడి తప్పింది. ఫిట్ నెస్ సమస్యలు పేలవ ఫామ్ తో గతేడాది జరగిన T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.
అయితే తాజాగా జరిగిన IPL లో గుజరాత్ టైటాన్స్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేసిన హార్దిక్.. మునుపటిలా చెలరేగిపోయాడు. ఫలితంగా మళ్లీ టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ తనపై ఉన్న అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ” అందరూ అనుకున్నట్లు నాపై BCCI సెలెక్టర్లు వేటు వేయలేదు. T20 ప్రపంచకప్ తర్వాత నేను టీమిండియా సెలెక్షన్ కు అందుబాటులో ఉండనిని వారికి చెప్పాను దాంతో వారు నన్ను టీమిండియాకు తీసుకోలేదు ” అని హార్దిక్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కు ఏ విధంగా అయితే కష్టపడ్డానో టీమిండియా కోసం అందుకు రెండింతలు ఎక్కువగా కష్టపడతానని పాండ్యా తెలిపాడు. అయితే ప్రస్తుతం దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి T20 ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకోగా.. టీమిండియా సభ్యులు 5వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు.