టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫలితమే గంభీర్ కొనసాగింపుకు కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ అంగీకరించాడు. గంభీర్ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో ఫలితాలే ముఖ్యమని తివారీ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గంభీర్ పనితీరును గమనిస్తుందనే తివారీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గంభీర్‌కు 2027 వన్డే ప్రపంచకప్ వరకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న విషయం తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ… ‘టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ 2026లో విజేతగా నిలపలేకపోతే.. బీసీసీఐ గౌతమ్ గంభీర్‌ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలి. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంభీర్ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. గౌతీ నేతృత్వంలో మంచి ఫలితాలే వచ్చినా.. ఐసీసీ టోర్నీల్లో ఫలితాలే ముఖ్యం. గంభీర్‌కు ప్రత్యామ్నాయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్ సరైన ఎంపిక. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిపై అతడికి మంచి అవగాహన ఉంది’ అని తివారీ చెప్పాడు.
Also Read: T20 World Cup 2026: వాషింగ్టన్ సుందర్ అవుట్.. ఐపీఎల్ స్టార్‌కు అవకాశం!
వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాళ్లతో అతడికి ఉన్న సంబంధాలు, ప్రశాంతమైన నిర్ణయ శైలి భారత జట్టుకు మేలు చేస్తాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా యువ జట్టును తీర్చిదిద్దే సామర్థ్యం అతడిలో ఉందని అంటున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో తివారీ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గంభీర్ నాయకత్వంలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో, అలాగే బీసీసీఐ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.