T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 ప్రారంభమైన తొలిరోజే సంచలనం నమోదయ్యేది. అయితే ఆఫ్ఘనిస్తాన్ 112 పరుగులు మాత్రమే చేయడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చిందని చెప్పాలి. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆప్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లివింగ్ స్టోన్ 29 పరుగులు చేశాడు. ఓపెనర్లు బట్లర్ (18), అలెక్స్ హేల్స్ (19), డేవిడ్ మలాన్ (18) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరూఖీ, ముజీబ్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ సాధించారు. ఆప్ఘనిస్తాన్ కనుక మరో 30 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Rohit Sharma: పాకిస్తాన్ టూర్ వివాదం.. బీసీసీఐపై తోసేసిన రోహిత్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ టీమ్ ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడింది. ఇంగ్లండ్ బౌలర్ శ్యామ్ కరన్ ఐదు వికెట్లతో విజృంభించాడు. అతడు 3.4 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు. ఆప్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జార్డాన్ 32 పరుగులు చేయగా ఉస్మాన్ ఘని 30 పరుగులు చేశాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కు అవుటయ్యారు. కాగా ఈ టోర్నీలో ఒక్క అగ్రశ్రేణి జట్టుకు అయినా ఆప్ఘనిస్తాన్ షాక్ ఇవ్వడం ఖాయంగా కనపడుతోంది.