భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సూపర్ విక్టరీ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా రాణించి, భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (378) సునాయాసంగా చేధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఒక సరికొత్త రికార్డ్‌ని సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. తొలుత 1977లో పెర్త్ వేదికగా భారత్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా చేధించింది. ఇప్పటివరకూ అదే అత్యధికం. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత అంతకుమించి లక్ష్యాన్ని చేధించి, ఆసీస్ రికార్డ్‌ని బ్రేక్ చేసింది.
నిజానికి.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ రాణించిన తీరు చూసి, ఐదో మ్యాచ్ కచ్ఛితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, రెండో ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి ఆ అంచనాలన్నీ బోల్తాకొట్టేశాయి. బ్యాటింగ్ విషయంలో భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. ఎవరి మీదైతే అంచనాలు పెట్టుకున్నామో, వాళ్లు చెత్త బ్యాటింగ్‌తో నిరాశపరిచారు. ఒక్క పంత్ మాత్రమే మంచి ప్రదర్శన కనబరిచాడు. అతనితో పాటు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా కాస్త ధీటుగా రాణించగలిగాడు. దీంతో, ఇంగ్లండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. ఇది డిఫెండ్ చేసుకోగలిగే స్కోరే! కాకపోతే, ఫీల్డింగ్ విషయంలో చాలా తప్పులు జరగడంతో మ్యాచ్ ఇంగ్లండ్ చేతికి వెళ్లిపోయింది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.
ప్రారంభం నుంచే ఇంగ్లండ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు నెమ్మదిగా కాకుండా వన్డే మ్యాచ్ తరహాలో రాణించారు. అనంతరం బెయిర్ స్టో (114), జో రూట్ (142) వికెట్ పడకుండా.. ఆచితూరి రాణించారు. చెరో సెంచరీ చేసుకొని.. 378 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. దీంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఒకవేళ భారత బ్యాట్స్మన్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించి ఉండుంటే, మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. గెలవాల్సిన మ్యాచ్‌ని చేజేతులా పోగొట్టుకున్నారు.