కేవలం బ్యాట్‌తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు. ఐసీసీ ఈవెంట్లతో కలుపుకుంటే.. కార్తీక్ కెప్టెన్ల సంఖ్య 11కు చేరుతుంది. పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది నాయకత్వంలో ఐసీసీ ఎలెవెన్ జట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించాడు.
త్వరలోనే కార్తీక్ కెప్టెన్ల సంఖ్య 12కి పెరగబోతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు సిద్ధం కానున్న సంగతి తెలిసిందే! ఈ టూర్‌లో భారత జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించబోతున్నాడు. అతని కెప్టెన్సీలోనూ దినేశ్ ఆడబోతున్నాడు. 2004లో తొలిసారి టీమిండియా తరఫున ఆడిన కార్తీక్.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ల కెప్టెన్సీల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.