న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ ఈరోజు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 782 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత మిచెల్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 118 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గజ్జల్లో నొప్పి కారణంగా అతడు సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
డారిల్ మిచెల్ కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ టర్నర్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్నాడు. 1979లో టర్నర్ టాప్‌లో ఉన్నాడు. ఇన్నేళ్లలో ఎందరో కివీస్ స్టార్ ఈ ఘనతను అందుకోలేకపోయారు. మార్టిన్ క్రోవ్, రోజర్ ట్వోస్, ఆండ్రూ జోన్స్, నాథన్ ఆస్టిల్, స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, మార్టిన్ గప్తిల్ వంటి ఆటగాళ్లు నంబర్ 1 ర్యాంక్‌కు చేరుకోలేకపోయారు. కొందరు టాప్-5లో నిలిచినా.. నంబర్ ర్యాంక్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇన్నేళ్లకు డారిల్ మిచెల్ టాప్ ప్లేస్ పట్టాడు.
Also Read: Property Dispute: ఆస్తికోసం అమానుషం.. దత్తపుత్రుడి హక్కును అడ్డుకున్న సొంత సోదరుడు!
డారిల్ మిచెల్ నాలుగు సంవత్సరాల క్రితం 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు బ్లాక్‌క్యాప్స్ తరపున మిచెల్ 56 వన్డేలు మాత్రమే ఆడాడు. ఏడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో 2,338 పరుగులు చేశాడు. అతడి సగటు 53 ఉండడం గమనార్హం. ఇక గ్లెన్ టర్నర్ తన కెరీర్‌లో 41 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 47 సగటుతో 1,598 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టర్నర్ పరుగులు తక్కువగా ఉండవచ్చు కానీ.. ప్రస్తుత యుగంలో అతని సగటు అసాధారణమైనది. ఇక 1979 గురించి చెప్పనవసరం లేదు. వన్డేల్లో టర్నర్ అత్యధిక స్కోర్ 171 నాటౌట్. ఒక్క పాయింట్ తేడాతో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం నంబర్ 1 బ్యాటర్ డారిల్ మిచెల్.